జంతువులు, పక్షుల ప్రభావం ఏమీ లేకుండానే అమెరికాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడ్డారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మిస్సోరికి చెందిన ఆ రోగికి ఆసుత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బర్డ్ ఫ్లూ నుంచి కోలుకుంటున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. తాజా కేసుతో కలిపి ఈ ఏడాది అమెరికాలో 14 మంది బర్డ్ ఫ్లూ బారిన పడ్డారు. అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు, జంతువుల ప్రభావం లేకుండా, వాటికి దగ్గరగా సంచరించకుండా ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడిన తొలి కేసు ఇదేనని సీడీసీ చెప్పింది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, సాధారణ ప్రజలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం అంత ఎక్కువగా ఏమీ లేదని సీడీసీ తెలిపింది.