‘ఇది నాకు చివరి రోజు లాంటిది. నాకు చాలా బాధగా ఉంది. నా పిల్లలు చనిపోతుంటే చూస్తూ ఉండటం నాకు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?” అని అమినా అడిగారు.
ఆమె ఆరుగురు పిల్లలు చనిపోయారు. వారిలో ఎవరూ మూడేళ్లకు మించి బతకలేదు. మరో బిడ్డ ప్రాణాల కోసం పోరాడుతోంది.
ఏడు నెలల బీబీ హజీరాను చూస్తుంటే అప్పుడే పుట్టిన శిశువు సైజులో ఉంది. ఆమె తీవ్రమైన పోషకాహార లోపంతో బాధ పడుతోంది.
హజీరా అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రి వార్డులో బెడ్ మీద ఉంది.
‘పేదరికం వల్ల నా పిల్లలు చనిపోతున్నారు. నేను వాళ్లకు ఇవ్వగలిగిన ఆహారం ఎండిపోయిన రొట్టె, ఎండలో వేడి చేసిన నీళ్లు మాత్రమే” అని అమినా చెప్పింది.
ఆమె మాటలు బాధతో అరుస్తున్నట్లుగా ఉన్నాయి.